ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.
మహబూబ్ నగర్ టౌన్ (తెలంగాణ సాహితి) మహబూబ్‌నగర్ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి, స్టేషన్ నిర్వహణ,పెండింగ్ కేసులు,ఫిర్యాదుల పరిష్కారం, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరించి, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు వేగం పెంచాలని, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు. స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించి క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు.
మహబూబ్‌నగర్ పట్టణంలో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రధాన వాణిజ్య ప్రాంతాలు, రద్దీగా ఉండే రహదారులు, మార్కెట్ ప్రాంతాలు కలిగి ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ గారు ఆదేశించారు.ముఖ్యంగా రద్దీ సమయాల్లో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపట్టాలని,నో-పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాల నిలుపుదలను నియంత్రించాలని, పాదచారులు మరియు వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు.
"వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక సూచనలు"వినాయక చవితి మరియు నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ గారు సూచించారు.వన్‌టౌన్ పరిధిలో ఏర్పాటు చేసే వినాయక మండపాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించాలని, మండప నిర్వాహకులు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వినాయక మండపాలు, ఊరేగింపులు మరియు నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలని, రద్దీ ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని వినియోగించాలని సూచించారు.
మండపాల వద్ద విద్యుత్ భద్రత,అగ్ని ప్రమాదాల నివారణ,శబ్ద పరిమితులు, రహదారుల ఆక్రమణ వంటి అంశాలపై నిర్వాహకులకు అవగాహన కల్పించాలని తెలిపారు.అలాగే ఉత్సవాల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సున్నితమైన ప్రాంతాలను గుర్తించి నిరంతరం పర్యవేక్షించాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని అనుమానాస్పద వ్యక్తులు మరియు వాహనాల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు.
ప్రజలు, ఉత్సవ నిర్వాహకులు పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలని ఎస్పీ గారు కోరారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659360 లేదా ఎమర్జెన్సీ నంబర్ 112కు సమాచారం అందించాలని సూచించారు.ఈ తనిఖీ సందర్భంగా వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్యతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Tags
Telangana
