
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,
- అంబేద్కర్ సంఘం నాయకుల డిమాండ్.
అచ్చంపేట, సెప్టెంబర్ 14(తెలంగాణ సాహితి) భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలతో ప్రచురించనున్నట్లు చెబుతున్న వివాదాస్పద పుస్తకాన్ని వెంటనే నిలిపివేసి,బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గంధం స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీస్‌స్టేషన్‌లో సోమవారం సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా గంధం స్వామి మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. అటువంటి మహనీయుడిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం, ఆయనను కించపరిచే విధంగా పుస్తకాన్ని ప్రచురించేందుకు ప్రయత్నించడం తీవ్రంగా అభ్యంతరకరమని పేర్కొన్నారు. వివాదాస్పద పుస్తకం ప్రచురణ, వ్యాప్తిని అడ్డుకుని బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల కిష్టయ్య మాట్లాడుతూ.. అంబేద్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని అన్నారు. భారత రాజ్యాంగ విలువలను అవమానించేలా, సామాజిక సామరస్యానికి భంగం కలిగించేలా వ్యవహరించిన సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
పాత్కుల శ్రీశైలం మాట్లాడుతూ.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గౌరవాన్ని, భారత రాజ్యాంగ ప్రతిష్ఠను కాపాడేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశన్న యాదవ్, మైనార్టీ సంఘం నాయకుడు మహబూబ్ అలీ, విజయ మోహన్, శ్రీను నాయక్, బిసమల ఆనంద్, విష్ణు, సమతా సైనిక్ దళ్ అచ్చంపేట డివిజన్ అధ్యక్షుడు వెంకటనారాయణ, మండల అధ్యక్షులు చెన్నయ్య, లక్ష్మయ్య, రాజమౌళి, నాయకులు శ్రీనివాస్ , తైలి శ్రీధర్, అంకాలు, అరుణ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. వివాదాస్పద పుస్తక ప్రచురణను నిలిపివేసి, సంబంధిత వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.