కీసర(తెలంగాణ సాహితి)లంచం వ్యవహారంలో కీసర పోలీసు స్టేషన్ సిఐ, ఎస్సై, అరెస్టు కావడం పోలీస్ శాఖలో తీవ్ర కలకల రేపింది. ఓ కేసులో నిందితుడికి బెయిల్ విషయంలో సహకరించేందకు రూ.10 లక్షలు డిమాండ్ చేశారన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.
రూ.5లక్షలు తీసుకుంటున్న సమయంలో ఎస్సైని పట్టుకున్నారు అనంతరం సిఐని కూడా అరెస్టు చేశారు. విశ్వాసనీయ సమాచారం ప్రకారం ఓ కేసులో నిందితుడికి బెయిల్ విషయంలో సహకరించేందుకు సీఐ ఆంజనేయులు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్టు ఆరోపణ.
అంతేకాకుండా కొన్ని రోజులుగా బాధితుడుతో బిర్యానీలు,కూల్ డ్రింక్స్ తేప్పిస్తూ ఇబ్బందులకు గురి చేసినట్లు సమాచారం. వేధింపులు భరించలేక బాధితుడు చివరకు ఏసీబీని ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. లంచం మొత్తంలో రూ.5 లక్షలు తీసుకునే బాధ్యతను ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి కి అప్పగించినట్టు సమాచారం.కీసర చెరువు గట్టు వద్ద వినాయక నిమజ్జనం విధుల్లో ఉన్న ఎస్సై డబ్బులు తీసుకుంటున్న సమయంలో డి.ఎస్.పి మజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో ఏసీబీ బృందం పట్టుకుంది.
ఏసీబీ అధికారులను గమనించిన ఎస్సై అక్కడినుండి పరుగులు తీసినట్టు సమాచారం. అనంతరం కెమికల్ పరీక్షలకు సైతం సహకరించకుండా అధికారులను ఇబ్బందులకు గురి చేసినట్లు
తెలిసింది.చివరకు ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి, సిఐ ఆంజనేయులును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఏసీబీ చర్యలు కీసర పోలీస్ స్టేషన్లో తీవ్ర చర్చ కు దారితీసాయి.
