మహబూబ్‌నగర్(తెలంగాణ సాహితి) గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు గ్రామ పంచాయతీ వారిగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సూచించారు. ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఏర్పడే వర్షాభావం, నీటి కొరతను ముందుగానే అంచనా వేసి ఎదుర్కొనేలా ప్రణాళికలు రూపొందించాలని, నీటి సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.వి.బి.జి. రామ్‌జీ పనుల కింద గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికల రూపకల్పనపై బాలానగర్, హన్వాడ, గండీడ్, మహబూబ్‌నగర్, మహమ్మదాబాద్, మిడ్జిల్, నవాబ్‌పేట్ మండలాల సర్పంచులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్రస్థాయి సిబ్బందికి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 1 నుంచి 2027 జూన్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల సమగ్ర అభివృద్ధికి దోహదపడే పనులను గుర్తించి వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో ప్రణాళికలను ప్రజల ముందుంచి ఆమోదం పొందిన అనంతరం పనులను అమలు చేయాలని తెలిపారు.
ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని నీటి భద్రతకు ప్రాధాన్యం వర్షపాతం అస్థిరత, వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాలపై పడే ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో నీటి భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంపొందించేలా చెక్‌డ్యామ్‌లు, ఫామ్ పాండ్లు, పర్కొలేషన్ ట్యాంకులు, రీచార్జ్ నిర్మాణాలు, రీచార్జ్ బోర్‌వెల్లు, సోక్‌పిట్లు వంటి పనులను అవసరమైన ప్రాంతాల్లో చేపట్టాలని తెలిపారు.వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల రీచార్జ్, వ్యవసాయంలో నీటి వినియోగ సామర్థ్యం పెంపు, పంటల వైవిధ్యీకరణ వంటి అంశాలను ప్రణాళికల్లో భాగం చేయాలని సూచించారు.
నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యం వి.బి.జి. రామ్‌జీ ప్రణాళికల్లో నీటి సంరక్షణ, మౌలిక వసతుల కల్పన, జీవనోపాధి అభివృద్ధి, వర్షాభావ పరిస్థితుల నివారణ అనే నాలుగు ప్రధాన రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ తెలిపారు.పాఠశాల భవనాలు, ప్రహరీ గోడలు, అంగన్‌వాడీ భవనాలు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి మౌలిక అవసరాలను గుర్తించి ప్రణాళికలో చేర్చాలని సూచించారు.ఫామ్ పాండ్లను కేవలం నీటి నిల్వకు మాత్రమే కాకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేపల పెంపకం, పశుపోషణ వంటి జీవనోపాధి కార్యక్రమాలకు ఉపయోగపడేలా ప్రణాళిక రూపొందించాలనితెలిపారు.వ్యవసాయంలోపంటల వైవిధ్యీకరణ, ఉద్యానవన పంటలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పశుపోషణకు అవసరమైన షెడ్లు, పశుగ్రాసం పెంపకం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
అధిక వర్షాల సమయంలో వరదలు, డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కాలువలు, చెరువులు, కుంటలు, ఫీల్డ్ ఛానళ్ల అభివృద్ధికి అవసరమైన పనులను ముందుగానే గుర్తించాలని తెలిపారు.గ్రామాల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు ప్రతి గ్రామానికి ఒకే విధమైన ప్రణాళిక కాకుండా, ఆయా గ్రామాల భౌగోళిక పరిస్థితులు, నీటి లభ్యత, వ్యవసాయ అవసరాలు,వర్షాభావ ప్రభావం, ప్రజల సమస్యలకు అనుగుణంగా పనులను ఎంపిక చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.జి.పి.డి.పి.జిసాప్ తదితర ప్రణాళికల్లో ఇప్పటికే గుర్తించిన పనులతో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను అనుసంధానం చేసి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ప్రణాళిక రూపకల్పనకు ముందు బేస్‌లైన్ డేటా, సోషల్ మ్యాపింగ్,రిసోర్స్ మ్యాపింగ్ నిర్వహించాలని తెలిపారు.గ్రామంలోని పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ భవనాలు, చెరువులు, కుంటలు, కాలువలు, ఎత్తైన మరియు లోతట్టు ప్రాంతాలను మ్యాప్‌లో గుర్తించి, ఆయా ప్రాంతాలకు అవసరమైన మౌలిక వసతులు, నీటి సంరక్షణ, వర్షపు నీటి నిర్వహణ పనులను గుర్తించాలని సూచించారు.
మూడేళ్ల దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలి.
2027 జూన్ వరకు అవసరమైన పనులతో పాటు తదుపరి మూడు సంవత్సరాలకు సంబంధించిన దీర్ఘకాలిక ప్రణాళికను కూడా రూపొందించాలని కలెక్టర్ తెలిపారు. గ్రామాల వారీగా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలను ఈ నెల 30వ తేదీలోగా సిద్ధం చేసి సమర్పించాలని సూచించారు.ప్రణాళికలు కేవలం అధికారిక ప్రక్రియగా కాకుండా గ్రామాల వాస్తవ అవసరాలకు అనుగుణంగా, కొలిచే ఫలితాలు వచ్చేలా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా నీటి సంరక్షణ, వర్షాభావ నివారణ పనుల్లో ప్రజలు, రైతులను భాగస్వాములను చేసి అవగాహన కల్పించాలని సర్పంచులకు సూచించారు.మంచి పనితీరు కనబరిచే గ్రామ పంచాయతీలను గుర్తించి ప్రోత్సహిస్తామని, ఉత్తమంగా పనిచేసే సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలి
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన తీర్మానాలు చేయాలని తెలిపారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సర్పంచులు, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. అక్టోబర్ 2న నిర్వహించే గ్రామసభల్లో గ్రామాభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించి అవసరమైన తీర్మానాలు చేయాలని తెలిపారు.
ప్రభుత్వ పథకాలు, అందుబాటులో ఉన్న నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టే విధానాలపై సర్పంచులు, పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించడమే శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్‌పీ సీఈఓ, ఇన్‌చార్జి డీపీఓ వెంకట్ రెడ్డి, డీఆర్‌డీఓ నరసింహులు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు, ఎఫ్‌ఏలు, టీఏలు, వి.బి.జి. రామ్‌జీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags
Telangana


