
- ఆర్మూర్ ఘటనపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
- డీజీపీ సీవీ ఆనంద్కి వినతిపత్రం అందజేసిన మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.

హైదరాబాద్ (తెలంగాణ సాహితి)నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలో కులవృత్తులపై ఆంక్షలు విధిస్తూ, వాటిని వ్యతిరేకించిన వారిని గ్రామ బహిష్కరణ చేయడం,సామాజికంగా వెలివేయడం వంటి చర్యలపై సమగ్ర విచారణ జరిపి,బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ కోరారు.ఈ మేరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కల్లు గీయడాన్ని,చేపలు పట్టడం,చేపలు అమ్మడాన్ని నిషేధించడం,చావు డప్పులు మోయడానికి రేట్లు విధించడం, గడ్డం గీయడానికి, బట్టలు ఉతకడానికి రేట్లు నిర్ణయించడం వంటి ఆంక్షలు విధించడం సరికాదన్నారు.తరతరాలుగా ఆయా వృత్తులను జీవనోపాధిగా కొనసాగిస్తున్న వృత్తి కులాలపై ఇలాంటి నిషేధాలు విధించడం వల్ల వారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు.ఇలాంటి ఆంక్షలను ధిక్కరించిన వారిని గ్రామ బహిష్కరణ చేయడం,వారితో మాట్లాడకుండా నిషేధించడం,ఆలయాల్లోకి రాకుండా అడ్డుకోవడం, పాలు, నీళ్లు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడం వంటి చర్యలు సామాజికంగా ఆందోళన కలిగించే విషయాలని అన్నారు.
ఎవరైనా వ్యక్తి లేదా కుటుంబాన్ని సామాజికంగా వెలివేసే హక్కు ఎవరికీ లేదని, ఇలాంటి ఘటనలపై అధికారులు సమగ్రంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.దేశంలో ఉన్నది ఒకే రాజ్యాంగం,ఒకే చట్టపరమైన వ్యవస్థ అని, రాజ్యాంగం, చట్టాల ప్రకారమే ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి తప్ప ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని అన్నారు.ఒకరి మనోభావాలను కించపరిచేలా వ్యవహరించడం, వారి సామాజిక హక్కులకు, జీవనోపాధికి ఆటంకం కలిగించడం సరైన పద్ధతి కాదన్నారు.ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో నాయి బ్రాహ్మణులు, రజకులు,గొల్ల-కురుమలు,గీతకార్మికులు,మత్స్యకారులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొన్న సామాజిక వెలివేత,కులవృత్తులపై ఆంక్షలు, దాడులపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీ సీవీ ఆనంద్ గారిని కోరారు.బాధిత కుటుంబాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి,ఘటనలకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇలాంటి ఆంక్షలు, సామాజిక వెలివేతలు కొనసాగడం మంచిది కాదని, వీటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి అన్నారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకుండా, ప్రతి ఒక్కరి హక్కులను, గౌరవాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీ గారిని కోరారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ అడ్వకేట్ అధ్యక్షులు దేవరాజ్, బాధిత కుటుంబాల సభ్యులు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Tags
Telangana