వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా పాములపై అవగాహన.

అచ్చంపేట(తెలంగాణసాహితి)వన్యప్రాణివారోత్సవాలు–2026లో భాగంగా అచ్చంపేట పట్టణంలోని NTR స్టేడియంలో వాకర్స్ క్లబ్ సభ్యులకు పాముల సంరక్షణ, రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో వన్యప్రాణుల పట్ల అవగాహన పెంపొందించడం, పాముల పట్ల ఉన్న అపోహలను తొలగించడం,పాములు–మనుషుల మధ్య సురక్షిత సహజీవనాన్ని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా జరిగింది.

ఈ సందర్భంగా స్నేక్ క్యాచర్ సుమన్, జూనియర్ అసిస్టెంట్ మరియు హన్మంతు నాయక్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అచ్చంపేట. పాములు వివిధ జాతులు, వాటి గుర్తింపు, విషపూరిత మరియు విషరహిత పాముల మధ్య తేడాలు, పాముల ప్రవర్తన, వాటి నివాస ప్రాంతాలు తదితర అంశాలను వివరించారు. పాములు పర్యావరణ సమతుల్యతలో పోషించే కీలక పాత్రను వివరించడంతో పాటు, ఎలుకలు మరియు ఇతర హానికర జీవుల నియంత్రణలో పాముల ప్రాధాన్యతను తెలియజేశారు.


అలాగే, ఇళ్లలోకి లేదా నివాస ప్రాంతాల్లోకి పాములు ప్రవేశించినప్పుడు ప్రజలు భయాందోళనలకు గురికాకుండా పాములను చంపకుండా, వాటికి దూరంగా ఉండి, శిక్షణ పొందిన స్నేక్ రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు. పాములను పట్టుకునే సమయంలో పాటించాల్సిన భద్రతా చర్యలు, పాముకాటుకు గురైనప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా వివరించారు.


పాములు ప్రకృతిలో ముఖ్యమైన జీవులని, వాటి ఉనికి అటవీ పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు ఎంతో అవసరమని కార్యక్రమంలో వివరించారు. ప్రతి పాము ప్రమాదకరమైనది కాదని, పాముల పట్ల భయంతో వాటిని అనవసరంగా చంపకుండా వన్యప్రాణి సంరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని అవగాహన కల్పించారు.

వాకర్స్ క్లబ్ సభ్యులు కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొని పాములకు సంబంధించిన పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. పాముల సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, ప్రకృతితో సహజీవనం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని నిర్వాహకులు తెలిపారు.

పాములను భయంతో చంపడం కాదు వాటి ప్రాముఖ్యతను తెలుసుకుని, సురక్షితంగా సహజీవనం చేయడమే నిజమైన వన్యప్రాణి సంరక్షణ అనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందించారు.

వన్యప్రాణి వారోత్సవాలు–2026 సందర్భంగా ప్రజల్లో ప్రకృతి, వన్యప్రాణులు,జీవవైవిధ్య పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు అటవీ శాఖ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు కొనసాగుతాయని రేవంత్ చంద్ర, జిల్లా అటవీ అధికారి నాగర్ కర్నూల్ తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2