విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్.
మహబూబ్ నగర్ ( తెలంగాణ సాహితి ) జిల్లాలోనీ సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో (KGBV) విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, పరిశుభ్రత, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హాస్టల్ సంక్షేమ అధికారులు, గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, KGBV ప్రత్యేక అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వసతి గృహాలు, పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుధ్యం, ఆరోగ్యం, విద్యాబోధన, భద్రతా చర్యలపై సమీక్షించారు.
వసతి గృహాలు, పాఠశాలల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. చెత్త, పిచ్చిమొక్కలు, పొదలు తొలగించి పాములు, విషపురుగులు సంచరించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్య తలెత్తినా వెంటనే స్పందించి అవసరమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.
విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు, KGBVల్లో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఉన్నారని, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అధికారులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంపొందించేలా వారానికి ఒకసారి మోటివేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్లిప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్లు నిర్వహించి విద్యార్థుల ప్రతిభను మెరుగుపరచాలని తెలిపారు. ఆంగ్ల భాషపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ ఆంగ్ల పాఠాలు ప్రారంభించే ముందు 10 నుంచి 15 నిమిషాల పాటు ప్రాథమిక వ్యాకరణ అంశాలను బోధించాలని సూచించారు. విద్యార్థులకు ఆంగ్లంలో మాట్లాడే అవకాశాలు కల్పించాలని అన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని, నెలకు ఒకసారి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బాలికల వసతి గృహాల్లో పరిశుభ్రత, వ్యక్తిగత ఆరోగ్యం, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
అధికారులు 15 రోజులకు కనీసం ఒకసారి తమ పరిధిలోని వసతి గృహాలు, పాఠశాలలను సందర్శించి విద్యార్థులతో బసచేసి పరిస్థితులను పరిశీలించాలని అదనపు కలెక్టర్ కోరారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును అధికారులపై నమ్మకంతో అప్పగిస్తున్నారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో షెడ్యూల్ కులాల అభివృద్ధి సంస్థ అధికారి సునీత, బి.సి సంక్షేమ అభివృద్ధి సంస్థ అధికారి విష్ణు నందన్, జి.సి.డి.ఓ ఆశ్ర ఖాద్రి, హాస్టల్ వెల్ఫేర్ ఆధికారులు, కె. జి. బి. వి ప్రత్యేక అధికారులు, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
