బాధితులకు రక్షణ,వైద్యం,న్యాయ సహాయం,కౌన్సెలింగ్‌తో పాటు పునరావాసం.
మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి)మహిళలు, బాలికలు ఏదైనా సమస్యను ఎదుర్కొన్నప్పుడు వివిధ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే చోట సమగ్ర సేవలు అందించడమే భరోసా కేంద్రం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా భరోసా కేంద్రం ద్వారా మహిళలు, బాలికలకు అందిస్తున్న సేవలను వివరిస్తూ రూపొందించిన “భరోసా కేంద్రం – ఒకే చోట అన్ని సేవలు” పోస్టర్‌ను జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ బుధవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... మహిళలు, బాలికల భద్రత, రక్షణకు పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను, భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. బాధితులకు తక్షణ రక్షణ కల్పించడంతో పాటు, వారి సమస్యను సున్నితంగా అర్థం చేసుకుని అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భరోసా కేంద్రం పనిచేస్తుందని తెలిపారు.
భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్, పోలీస్ సహాయం, వైద్య సహాయం, న్యాయ సలహాలు, పునరావాసం, విద్యా–ఉపాధి సంబంధిత సహాయం వంటి సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్పీ వివరించారు. ముఖ్యంగా బాధిత మహిళలు, బాలికలకు మానసిక ధైర్యం కల్పించి, వారు తిరిగి సాధారణ జీవితాన్ని కొనసాగించేలా అవసరమైన సహాయ సహకారాలను అందించడం భరోసా కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు.
“బాధిత మహిళలు, బాలికలు తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా ముందుకు రావాలి. వారికి అండగా పోలీస్ శాఖ, భరోసా కేంద్రం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. బాధితులకు రక్షణ, న్యాయం, భద్రతతో పాటు భవిష్యత్తుపై నమ్మకం కల్పించడమే మా లక్ష్యం” అని ఎస్పీ తెలిపారు.
అలాగే మహిళలు, బాలికలపై వేధింపులు, హింస, లైంగిక దాడులు లేదా ఇతర సమస్యలు ఎదురైనప్పుడు తక్షణమే పోలీసులను లేదా భరోసా కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. బాధితుల గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ, వారికి అవసరమైన సహాయాన్ని సమన్వయంతో అందిస్తామని తెలిపారు.
భరోసా కేంద్రం అందించే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పోస్టర్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మహిళ, ప్రతి బాలికకు భద్రత, గౌరవం, న్యాయం అందేలా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కృష్ణయ్య, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ నర్సింలు, భరోసా ఇన్‌చార్జి సబ్‌ఇన్‌స్పెక్టర్ అరుణ, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు.
