క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించేందుకు స్క్రీనింగ్ చేయించుకోవాలి: ఎం.పి. డి. కె అరుణ.


క్యాన్సర్ తొలి దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స, కలెక్టర్ ఖుష్బూ గుప్తా.

మహబూబ్ నగర్ (తెలంగాణ సాహితి) క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి, సకాలంలో చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం ఉంటుందని మహబూబ్‌నగర్ ఎం.పి డి.కె అరుణ అన్నారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, క్యాన్సర్ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

బాలానగర్ మండలంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఫ్యూయలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ ఎం.పి డి.కె అరుణ, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా తో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా "ఎం.పి డి.కె అరుణ" మాట్లాడుతూ కుటుంబ బాధ్యతల్లో నిమగ్నమై చాలామంది మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, వ్యాధి ముదిరిన తర్వాత చికిత్స కష్టతరమై ఖర్చులు కూడా పెరుగుతాయని తెలిపారు. తొలిదశలో గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి వ్యాధిని నియంత్రించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC) పరిధిలో క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరారు. స్క్రీనింగ్‌లో అనుమానిత కేసులను గుర్తించి, వారికి తదుపరి పరీక్షలు, చికిత్స అందేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ప్రభుత్వ పథకాలు, ఉచిత లేదా తక్కువ ఖర్చుతో లభించే వైద్య సేవలపై అవగాహన కల్పించాలని అన్నారు.

మహిళలు రొమ్ము, గర్భాశయ ముఖద్వారం తదితర క్యాన్సర్ల లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని, ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. బాలికలకు హెచ్‌పీవీ టీకాపై తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని కోరారు.

‘ఇంట్లో తల్లి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది’ అని పేర్కొన్న ఎంపీ, ప్రతి ఒక్కరూ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

"జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా" మాట్లాడుతూ, మహిళలు కుటుంబ బాధ్యతలు వల్ల తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నారు. క్యాన్సర్‌కు సంబంధించిన లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించి పూర్తిగా నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

అందువల్ల మహిళలు తప్పనిసరిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని మహిళలందరికీ ఇటువంటి స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ఎంపీ డీకే అరుణకు, ఫ్యూయలింగ్ గ్రోత్ ఫౌండేషన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండేషన్‌కు జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించే క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమానికి మహిళలు పూర్తి సహకారం అందించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సహకారంతోనే కార్యక్రమం విజయవంతమవుతుందని తెలిపారు.

స్క్రీనింగ్ అనంతరం క్యాన్సర్ అనుమానం ఉన్నవారిని అవసరమైన తదుపరి పరీక్షలు, చికిత్స కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫర్ చేయడంతో పాటు, వారి చికిత్స ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (PHC) వైద్యులు ప్రతి కేసును సున్నితంగా పరిగణించి, స్క్రీనింగ్ తర్వాత అవసరమైన తృతీయ స్థాయి చికిత్స అందేలా ఫాలోఅప్ చేయాలని సూచించారు.

స్క్రీనింగ్‌లో గుర్తించిన కేసులపై ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహించి, సంబంధిత మహిళలు ఎక్కడ చికిత్స పొందుతున్నారు, వారికి ఎలాంటి వైద్య సహాయం అవసరమవుతోంది అనే వివరాలను తెలుసుకోవాలని తెలిపారు. అవసరమైన వారికి ప్రభుత్వ పథకాల ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంస్థలు, వైద్యులు, సిబ్బందికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

"డి.ఎం.హెచ్‌.ఓ డాక్టర్ ఏ.శ్రీనివాసులు" మాట్లాడుతూ, జిల్లాలో 850 మంది ఆశా కార్యకర్తల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, అవసరమైన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 

14 ఏళ్లలోపు పిల్లలకు HPV వ్యాక్సిన్ అందించడం ద్వారా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని, అవసరమైన పరీక్షలను అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వం అందిస్తున్న క్యాన్సర్ నివారణ, స్క్రీనింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు, ఫ్యూయలింగ్ గ్రోత్ ఫౌండేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2