
వేధింపులతోనే గురుకుల విద్యార్థిని అశ్విని ఆత్మహత్య..!
అనుమానాలున్నాయటూ తండ్రి ఫిర్యాదు
షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
అశ్వినినీ వేధించింది ఆమె దగ్గరి బంధువు "రమేష్"..
నిందితుడు రమేష్ పై షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు*
కమ్మదనం గురుకుల పాఠశాల నుండి "రెండు లక్షలు" వసూలు..!
షాద్ నగర్ (తెలంగాణ సాహితి)కమ్మదనం గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 18 ఏళ్ల గిరిజన విద్యార్థిని ముదావత్ అశ్విని మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అశ్విని మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ ఆమె తండ్రి ముడావత్ చందర్ షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 2న సాయంత్రం సుమారు 5:09 గంటలకు అశ్విని క్లాస్ టీచర్ సద్గుణ తనకు ఫోన్ చేసి, తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని సమాచారం ఇచ్చినట్లు తండ్రి తెలిపారు. దీంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా అశ్విని అక్కడ కనిపించలేదని, ఆరా తీయగా ఆమెను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
గురుకుల వసతి గృహంలోని గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని అశ్విని మృతి చెందినట్లు కళాశాల సిబ్బంది తనకు తెలిపారని తండ్రి పేర్కొన్నారు. అలాగే హాస్టల్ హెచ్‌ఓ నర్స్‌కు ఫోన్ చేసినా స్పందించలేదని, ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని ఫిర్యాదులో తెలిపారు. మరోవైపు గతంలో తమ గ్రామానికి చెందిన ఆర్. రమేష్ తన కుమార్తెను వేధించి, బెదిరించాడని, దీనిపై జడ్చర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసినట్లు అశ్విని తండ్రి వెల్లడించారు.
కుమార్తె మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయని, సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. తండ్రి ఫిర్యాదుతో షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 758/2026, BNSS సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసినట్లు రికార్డులో ఉంది. ఎస్‌ఐ రాథ్లావత్ శ్రీకాంత్ నాయక్ కేసు దర్యాప్తును చేపట్టారు. అశ్విని మృతికి దారితీసిన పరిస్థితులు, ఘటనకు ముందు చోటుచేసుకున్న పరిణామాలు, ఫిర్యాదులో పేర్కొన్న అనుమానాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags
క్రైమ్