ఆత్మహత్యలు వద్దు మీకు నేనున్నా టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

 దద్దమ్మ ప్రభుత్వం ఆర్టీసీని అరిగోస పెడుతుంది.

 మండలిలో మీ సమస్యను లేవనెత్తుతా.

హైదరాబాద్(తెలంగాణ సాహితి)ఇంద్రపార్క్ వేదికగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ ఆర్టీసీ యూనియన్ అయిన బహుజన వర్కర్స్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ గౌరవ అధ్యక్షుడు TVR ఆధ్వర్యంలో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ, పీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్ తదితర పదవీ విరమణ ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన మహాధర్నాలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొని రిటైర్డ్ కార్మికులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న వేలాది మంది రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మల్లన్న గారు,ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా జీవించాల్సిన వయసులో తమకు రావాల్సిన హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడటం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు కాదు, వీరు తమ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న "అవిశ్రాంత ఉద్యోగులు" అని అభివర్ణించారు.

ఆర్టీసీ ఉద్యోగులకు రావాల్సిన బకాయిల మొత్తం కేవలం రూ.860 కోట్లేనని, ప్రభుత్వం సంకల్పం చేస్తే ఒక్క రోజులోనే సమస్య పరిష్కారం అవుతుందని పేర్కొన్నారు. కోకాపేట్ ప్రాంతంలో మూడు ఎకరాల ప్రభుత్వ భూమి విక్రయిస్తే వచ్చే ఆదాయంతోనే రిటైర్డ్ ఉద్యోగులందరికీ రావాల్సిన బెనిఫిట్స్ చెల్లించవచ్చని, కానీ ప్రభుత్వం కార్మికుల కన్నీళ్లు తుడవడం కంటే ఇతర అంశాలపైనే దృష్టి పెడుతోందని ఆరోపించారు.

గ్రాట్యుటీ చట్టం ప్రకారం ఉద్యోగి పదవీ విరమణ చేసిన నెల రోజుల్లోపు గ్రాట్యుటీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, సంవత్సరాల తరబడి ఉద్యోగుల సొమ్మును నిలిపివేయడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. కార్మికుల కష్టార్జిత సంపాదనను ప్రభుత్వం వాడుకుంటూ కాలయాపన చేయడం దారుణమన్నారు.గత కొన్నేళ్లుగా బెనిఫిట్స్ అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ వందలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసిన మల్లన్న, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం జీవితాంతం సేవ చేసిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం కూడా చూపడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో అదే పరిస్థితి ప్రస్తుతం ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ కార్మికుల బ్రతుకులు గాని రిటైర్డ్ కార్మికుల బెనిఫిట్స్ విషయంలో అన్యాయమే జరిగిందని మండిపడ్డారు.

నష్టాల్లో ఉందనే కారణంతో వేల కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం భుజాన వేసుకుని మెట్రో ప్రాజెక్టును టేకోవర్ చేసేందుకు ముందుకు వస్తోందని, మరి లక్షలాది మంది ప్రజలకు సేవలందిస్తున్న ఆర్టీసీ సంస్థను, ఆ సంస్థ ఉద్యోగులను ఆదుకోవడానికి మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.ఈ నెల ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను చట్టసభలో ప్రస్తావిస్తానని,వారికి రావాల్సిన ప్రతి రూపాయి చెల్లించే వరకు శాసనసభలోనూ, ప్రజా ఉద్యమాల్లోనూ పోరాటం కొనసాగిస్తానని మల్లన్న ప్రకటించారు. ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రతి రూపాయి వసూలు చేస్తానని వారికి భరోసా కల్పించారు.ఎవరూ అధైర్యపడవద్దని, ఆత్మహత్యల వంటి ఆలోచనలకు దూరంగా ఉండాలని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరియు బహుజన వర్కర్స్ యూనియన్ ఎల్లప్పుడూ వారి వెన్నంటి ఉంటాయని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ చైర్మన్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సాజిద్,MBT స్పోక్స్ పర్సన్ అంజాద్ ఉల్లా ఖాన్,బిసి ఎంప్లాయిస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు దేవళ్ళ సమ్మయ్య,BWU రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2