ఆరోగ్యవంతమైన ప్రజలతోనే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యం. కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి



ఆరోగ్యం, పోషకాహారం, ఫిట్‌నెస్‌పై ప్రజల్లో అవగాహన ఒక మహా ఉద్యమంగా మారాలి.

హైదరాబాద్PIBన్యూస్(తెలంగాణసాహితి)ఆరోగ్యవంతమైన ప్రజలు లేకుండా ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యం కాదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దాలంటే ఆరోగ్యం, పోషకాహారం, పరిశుభ్రత, ఫిట్‌నెస్, క్రీడలు, మహిళలు, పిల్లల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఏ.వి. కళాశాల ప్రాంగణంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (CBC) ఐదు రోజుల పాటు నిర్వహించిన జాతీయ పోషణ మాసోత్సవం ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్విజ్, పోస్టర్ మేకింగ్, వీడియో మేకింగ్, పోషకాహార వంటకాల తయారీ వంటి పోటీల ద్వారా ముఖ్యంగా విద్యార్థులు, యువత, మహిళల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవాలని శ్రీ కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై స్వయంగా బాధ్యత తీసుకోవాలని, ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత నిద్ర, వ్యాయామం, నడక, యోగా, క్రీడలను రోజువారీ జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు.

అవసరానికి మించిన నూనె, చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలని ఆయన సూచించారు. పిల్లలు, యువతలో అధిక బరువు, స్థూలకాయం వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో చిన్న వయస్సు నుంచే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని అన్నారు. ఇంటివద్ద తయారు చేసే తాజా, పోషక విలువలున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, జంక్ ఫుడ్‌పై అధికంగా ఆధారపడే అలవాటును తగ్గించాలని సూచించారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, శారీరక శ్రమను తగ్గించిందని కేంద్ర మంత్రి అన్నారు. సెల్‌ఫోన్, కంప్యూటర్, టెలివిజన్ వంటి డిజిటల్ పరికరాల వినియోగాన్ని పరిమితం చేయాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో మొబైల్ వినియోగాన్ని తగ్గించి సమయానికి నిద్రపోవాలని సూచించారు.

దేశ భవిష్యత్తును నిర్మించాల్సిన యువత మాదకద్రవ్యాల బారిన పడటం ఆందోళనకరమని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, పోలీసు శాఖ, స్వచ్ఛంద సంస్థలు, సమాజంలోని ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

“నషా ముక్త్ భారత్”, “ఫిట్ ఇండియా”, “డ్రగ్ ఫ్రీ ఇండియా” వంటి కార్యక్రమాలు కేవలం నినాదాలు కాదని, దేశ భవిష్యత్తు కోసం చేపడుతున్న కార్యక్రమాలని ఆయన పేర్కొన్నారు. భారతదేశ యువశక్తిని ఆరోగ్యవంతంగా, శక్తివంతంగా తీర్చిదిద్దితేనే దేశం అభివృద్ధిలో మరింత ముందుకు సాగగలదని అన్నారు.

2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణ లక్ష్యాన్ని సాధించేందుకు ఆరోగ్యవంతమైన సమాజం కీలకమని, అందుకోసం ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పీఐబీ, సీబీసీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీమతి శృతి పాటిల్ మాట్లాడుతూ, ఐదు రోజుల కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పోషకాహారం, ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించామని తెలిపారు. వివిధ పోటీలు, కార్యక్రమాల ద్వారా సమతుల్య ఆహారం ప్రాముఖ్యతను తెలియజేశామని అన్నారు. అవగాహన కార్యక్రమం ముగింపు కాదు—చర్యకు నాంది అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి, ప్రతి కుటుంబం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన, బలమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది

Ad 2